: శేష జీవితం భాగ్యనగరిలోనే!... కొణిజేటి రోశయ్య ప్రకటన!
తెలుగు నేలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య తమిళనాడు గవర్నర్ గా ఐదేళ్ల పాటు పనిచేశారు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు ప్రజలతోనూ కలిసిపోయిన రోశయ్య... ఎలాంటి వివాదాలు లేకుండానే నెట్టుకురాగలిగారు. మూడు రోజుల క్రితం ఆయన పదవీ విరమణ చేశారు. ఇక మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే యోచనేది లేదని చెప్పిన ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరులో జన్మించిన రోశయ్య తన శేష జీవితాన్ని మాత్రం హైదరాబాదులో గడుపుతానని ప్రకటించారు. ఉమ్మడి ఏపీకి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రోశయ్య... ఏకంగా 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రతిపాదించి రికార్డు నెలకొల్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఆయన కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోశయ్యను సీఎం పదవి కూడా వరించింది. తన రాజకీయ జీవితం మొత్తం హైదరాబాదు కేంద్రంగానే సాగిందని చెప్పిన రోశయ్య... తన శేష జీవితం కూడా భాగ్యనగరిలోనేనని చెప్పుకొచ్చారు.