: భువనగిరి ఆర్డీవో ఆఫీసుకి చేరుకున్న 1700 మంది నయీమ్ బాధితులు
ఇటీవలే తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నయీమ్ అనుచరులను సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. గతంలో నయీమ్ అక్రమంగా చేసుకున్న పలు ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ఈరోజు నల్గొండలోని ఆర్డీవో కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీమ్ లాక్కున్న అంశంపై వారు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తమ భూములు నయీమ్ అక్రమంగా లాక్కున్నాడని సుమారు 1700 మంది బాధితులు ఆర్డీవో ఆఫీసుకి చేరుకున్నారు. వారి ప్లాట్లకు సంబంధించిన పలు పత్రాలను తమతో తీసుకువచ్చి మీడియాకు కూడా చూపించారు. తమను నయీమ్ అనుచరులు భయపెట్టారని వారు మీడియాతో అన్నారు. తమ ప్లాట్లను తమకు అప్పగించాల్సిందిగా వేడుకున్నారు.