: దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 12 గంటల ప్రయాణమే!... రైల్వేల స్వప్నం ఇదేనన్న సురేశ్ ప్రభు!
భారతీయ రైల్వేల స్వప్నాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు నిన్న వెల్లడించారు. దేశంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా... 12 గంటల్లో ప్రయాణికులను చేర్చడమే ఆ కల అని ఆయన ప్రకటించారు. నిన్న ఢిల్లీలో అల్ట్రా హైస్పీడ్ టెక్నాలజీపై జరిగిన గ్లోబల్ మీట్ లో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణికులను 12 గంటల్లోగా చేర్చేలా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకనుగుణంగా రైల్వేల సగటు వేగాన్ని పెంచాలని భావిస్తున్నామని ప్రభు చెప్పారు. తద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, అందరికీ ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు.