: వివాదంలో పీవీ సింధు, దీపా కర్మాకర్!... రియోలో స్పాన్సర్ ఒప్పందాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు!


ఇటీవలే ముగిసిన రియో ఒలింపిక్స్ లో కాకలు తీరిన క్రీడాకారులంతా పెట్టే బేడా సర్దుతున్న తరుణంలో భారత సత్తా చాటుతూ తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ లో రజత పతకాన్ని సాధించింది. ఇక పతకం సాధించలేకపోయినా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. అయితే వీరిద్దరితో పాటు రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ కూడా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సదరు వివాదం పెద్దదేమీ కాకున్నా... స్పాన్సర్లతో కుదిరిన ఒప్పందాలను ధిక్కరిస్తూ వారు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తేలానే ఉన్నాయి. వివరాల్లోకెళితే... రియో ఒలింపిక్స్ కు సంబంధించి భారత ఒలింపిక్ సంఘంతో ‘లీ నింగ్’ అనే సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.3 కోట్లను భారత ఒలింపిక్ సంఘానికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు సంస్థ... రియోలో భారత క్రీడాకారులంతా తమ బ్రాండ్ దుస్తులనే వాడాలని షరతు పెట్టింది. అయితే పీవీ సింధు, దీపా కర్మాకర్, యోగేశ్వర్ దత్, కిడాంబి శ్రీకాంత్ లు పలు మ్యాచ్ ల్లో లీ నింగ్ బ్రాండ్ దుస్తులు కాకుండా ఇతర కంపెనీలవి వాడారట. దీనిపై లీ నింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత ఒలింపిక్ సంఘానికి లేఖ కూడా రాసింది.

  • Loading...

More Telugu News