: ఏపీ దెబ్బకు ‘హోదా’ కనుమరుగేనా?... కీలక నిర్ణయం దిశగా కేంద్రం కసరత్తు!
ప్రత్యేక హోదా కోసం నవ్యాంధ్ర నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా దేశంలో వెనుకబడ్డ రాష్ట్రాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీని పక్కనబెడితే... ప్రస్తుతం ప్రత్యేక హోదా 11 రాష్ట్రాలకు అమలవుతోంది. ఇక రాష్ట్ర విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీ తనకూ ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు నవ్యాంధ్ర ప్రజలతో పాటు అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రత్యేక హోదా గళాన్ని వినిపిస్తున్నాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే... తమకూ కావాలంటూ కొన్ని రాష్ట్రాలు కాసుకుని కూర్చున్నాయట. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉన్నా... ఆ దిశగా కేంద్రం అడుగులు వేసేందుకు సాహసించడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి వంటి కీలక విభాగాలను రద్దు చేసిన బీజేపీ సర్కారు... రాజకీయ ఒత్తిడులు తప్పించుకునే క్రమంలో ప్రత్యేక హోదాను కూడా రద్దు చేస్తే సరిపోతుందిగా అన్న దిశగా యోచిస్తోందట. దీనికి సంబంధించి ఇప్పటికే కేటినెట్ ముందుకు ఓ ప్రతిపాదన కూడా వచ్చిందని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పేస్తే... ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక హోదా డిమాండ్లు వినిపించవు కదా అన్న కోణంలో సర్కారు యోచిస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇక ప్రత్యేక ప్యాకేజీలతోనే ఏపీ సహా ఆయా రాష్ట్రాలను సంతృప్తిపరచి ప్రత్యేక హోదా డిమాండ్ కు చెల్లుచీటి ఇచ్చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.