: కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు?: నాగం జనార్దన్ రెడ్డి
ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైతే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరుపుతామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. తిరంగాయాత్ర సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఈనెల 17న విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించని పక్షంలో బీజేపీ తరపున ప్రభుత్వ కార్యాలయాలపై తామే జెండాలు ఎగరవేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తిరంగాయాత్ర ముగింపు రోజున (శనివారం) కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారాం తమతో యాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు.