: హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణీ కాన్పుకు నిరాకరించిన వైద్యులు
హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణీకి కాన్పు చేసేందుకు వైద్యులు నిరాకరించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో జరిగింది. బదౌన్ లోని ఒక ఆసుపత్రికి నిండు గర్భిణీ అయిన తన భార్యను ఓ భర్త తీసుకువెళ్లాడు. అయితే, హెచ్ఐవీ పాజిటివ్ అయిన ఆమెను తమ ఆసుపత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. భర్త ఎంత ప్రాధేయపడినా వైద్యులు ఒప్పుకోలేదు. వేరే ఆసుపత్రికి తీసుకుపొమ్మంటూ దురుసుగా ప్రవర్తించారు. దాంతో ఆ అర్థరాత్రి సమయంలోనే తన భార్యను తీసుకుని అక్కడి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి, బిడ్డను బయటకు తీశారు. అయినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే, సకాలంలో వైద్యం అందకపోవడంతో బిడ్డ చనిపోయింది. తమ బిడ్డ చనిపోవడానికి కారణం మొదట తాము వెళ్లిన ఆసుపత్రి వైద్యులేనని, వారు ఆ విధంగా ప్రవర్తించడం వల్లే తమకు ఈ వేదన మిగిలిందని తల్లిదండ్రులు వాపోయారు.