: ఇంకా ఉందామనుకున్నా... కానీ మోదీ ప్రభుత్వంతో డీల్ కుదరలేదు: రఘురాం రాజన్
మరికొంత కాలం పాటు ఇండియాలోనే ఉండి సేవలందించాలని భావించానని, అయితే, నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సరైన అగ్రిమెంట్ కుదరలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. తన పదవీకాలాన్ని ఎల్లుండితో పూర్తి చేసుకోనున్న ఆయన, గవర్నర్ భాధ్యతలను ఉర్జిత్ పటేల్ కు అప్పగించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన "ఇక్కడ నేను చేయాలనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఇంకొంత కాలం ఉండాలని అనుకున్నా. కానీ అందుకు తగ్గ చర్చలు సాగలేదు. ఇక ఆ విషయం ముగిసింది" అని అన్నారు. ఒక దశలో తనను మరో మూడేళ్ల పదవీ కాలానికి పొడిగించాలన్న ప్రతిపాదన సైతం వచ్చినప్పటికీ, అది ఆగిపోయిందని తెలిపారు. దేశంలో అసహనం పెరుగుతోందని గతంలో తాను చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని సైతం రాజన్ సమర్థించుకున్నారు. అప్పటి పరిస్థితి అటువంటిదేనని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించానని, ఇక తిరిగి విద్యారంగంలోకి వెళ్లిపోతానని అన్నారు. తాను ఇండియాకు చేయాలని అనుకున్న కొన్ని పనులు మిగిలిపోవడం మాత్రం కొంత అసంతృప్తిని కలిగిస్తోందని అన్నారు. ఇండియాలో ద్రవ్యోల్బణం 6 శాతానికన్నా తక్కువగానే ఉంటుందని అంచనా వేశారు.