: వైమానిక శక్తిని భారత్ సరిగా వినియోగించుకోలేదు, అందుకే 'పీఓకే' సమస్య!: వైమానిక చీఫ్ సంచలన వ్యాఖ్యలు
1971 యుద్ధంలో భారతదేశం తన వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అరూప్ సాహా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పీవోకే విషయంలో ఆదర్శాల ప్రాతిపదికన కాకుండా సైనిక చర్యకు దిగివుంటే, ఆ ప్రాంతం ఇప్పటికీ మన అధీనంలోనే ఉండేదని అన్నారు. ఐక్యరాజ్యసమితి, అలీనోద్యమం, పంచశీల లక్ష్యాలకు అనుగుణంగా మన విదేశాంగ విధానం వుంది. అలాగే, మనదేశాన్ని పెద్ద ఆశయాలున్న నేతలు పాలించారు' అన్నారాయన. దేశ భద్రతావసరాల విషయంలో మనం ఎప్పుడూ ఆచరణాత్మక వైఖరిని అవలంబించలేదని ఆయన తెలిపారు. ఇతర దేశాలు మనతో సామరస్యపూర్వకంగా ఉండే వాతావరణం నెలకొల్పడంలో మన సైనిక శక్తిని మనం విస్మరించామని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పీవోకే మన శరీరంలోకి దిగిన ముల్లులా మనల్ని ఇబ్బంది పెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భద్రతావసరాల విషయంలో భారత్ ఎప్పుడూ ఆచరణాత్మక ధోరణిని అవలంబించలేదని ఆయన అన్నారు. భారత్ లో భద్రతా వాతావరణం దుర్భరంగా ఉందని పేర్కొన్న ఆయన, గగనతల వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఈ సమస్యను, సంక్షోభాలను అధిగమించి, శాంతిభద్రతలను నెలకొల్పే అవకాశముందని అభిప్రాయపడ్డారు. సవాళ్లను, సంఘర్షణలను ఎదుర్కోవడంలో సైనిక శక్తి, ముఖ్యంగా వైమానిక శక్తిని వినియోగించుకోవడంలో భారత్ ఎప్పుడూ విముఖత చూపిస్తూ వస్తున్నదని ఆయన విమర్శించారు.