: మత వివక్షకు గురైన యువరాజ్ సింగ్ కాబోయే భార్య... ఆగ్రహం వ్యక్తం చేసిన యువీ
స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కాబోయే భార్య, సినీనటి హాజెల్ కీచ్ భారత దేశంలో మతవివక్ష ఎదుర్కొంది. వివరాల్లోకి వెళ్తే...డబ్బులు డ్రా చేసుకోవడానికి హాజెల్ కీచ్ తన తల్లి, ఫ్రెండ్ తో కలిసి జైపూర్ లోని వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ సంస్థ బ్రాంచ్ కి వెళ్లారు. అక్కడ పియూష్ శర్మ అనే ఉద్యోగిని తన ఖాతాలోనికి బదిలీ అయిన డబ్బులు ఇవ్వాలని కోరింది. దీనికి పియూష్ శర్మ నిరాకరించారు. దానికి కారణం హాజెల్ కీచ్ హిందూ మతానికి చెందిన వ్యక్తి కాకపోవడమే. ఈ కారణం విన్న హాజెల్ కీచ్ కు కోపం మిన్నంటింది. అయినా ఏమీ చేయలేక...జరిగిన ఘటనపై ట్వీట్ చేసింది. ‘ఇంతవరకు నేను కలిసిన వారిలో జైపూర్ లోని వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థలో పనిచేస్తున్న పియూష్ శర్మ అత్యంత జాతివివక్ష కలిగిన వ్యక్తి. నా పేరు హిందూ మతానికి చెందినది కాదన్న కారణంతో నాకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన నాకు బాధ కలిగించింది. హిందువైన నా తల్లి, నా ముస్లిం ఫ్రెండ్ ఎదురుగా నన్ను అమానించాడు. నా పేరు హాజల్ కీచ్. నేను హిందువుగా పుట్టి పెరిగాను. కానీ సమస్య అదికాదు. పేరు చూసి వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థ వివక్ష చూపిస్తుందా’ అని ప్రశ్నించింది. దీనిపై యువరాజ్ సింగ్ కూడా 'పియూష్ శర్మ ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మనుషులుగా మనమంతా జాతివివక్షను సహించకూడదు. శర్మపై వెస్ట్రన్ యూనియన్ మనీ కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాన'ని ట్వీట్ చేశాడు. గతేడాది నవంబర్ లో యువీ-కీచ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.