: చంద్రబాబుకు దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలి: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ
ఓటుకు నోటు కేసులో తనపై విచారణను నిలిపివేయాలంటూ చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించడం తగదని, ఆయనకు దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపుల్లో ‘మావాళ్లు.. బ్రీఫ్ డ్ మీ’ అన్న గొంతు చంద్రబాబుదేనన్న విషయం ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిపోయిందన్నారు. చంద్రబాబు స్వయంగా మాట్లాడిన మాటలు బయటపడిన తర్వాత కూడా ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆవిధంగా చేయడం ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు విచారణకు సిద్ధం కావాలని వాసిరెడ్డి పద్మ సవాలు చేశారు.