: కాసులు కురిపిస్తున్న 'ద కపిల్ శర్మ షో'...రికార్డు పారితోషికాలు


హిందీ బుల్లితెర సంచలన కార్యక్రమం 'ది కపిల్ శర్మ షో'లో నటించే తారలు రికార్డు స్థాయి పారితోషికాలు తీసుకుంటున్నారని ముంబయ్ కి చెందిన డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు తీసుకునే స్థాయి పారితోషికాలను వీరు కూడా పొందడం విశేషం. సోనీ టీవీలో ప్రసారమయ్యే ఈ షోలో ప్రధాన భూమిక పోషించే కపిల్ శర్మ ఎపిసోడ్ కు 60 నుంచి 80 లక్షల రూపాయల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక ఇందులో జడ్జి భూమిక పోషించే వెటరన్ క్రికెటర్ సిక్సర్ల సిద్ధూ ఎపిసోడ్ కు 8 నుంచి 10 లక్షలు తీసుకుంటున్నాడని సమాచారం. కపిల్ తరువాత షోను రక్తికట్టించే సునీల్ గ్రోవర్ 10 నుంచి 12 లక్షల రూపాయలు, కికు షర్ధ 5 నుంచి 7 లక్షల రూపాయలు, చందన్ ప్రభాకర్ 4 లక్షల రూపాయలు, సమోనా చక్రవర్తి 6 నుంచి 7 లక్షల రూపాయలు, రొషెల్లీ రావు 3 నుంచి 4 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన కపిల్ శర్మ నెలలో ప్రసారమయ్యే ఎనిమిది షోలకు కలిపి కనీసం 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో పారితోషికాల్లో కపిల్ శర్మ బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, కపిల్ శర్మకు భారత్, పాక్, కెనడాల్లో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఈ షోను సుమారు ఐదు కోట్ల మంది వీక్షిస్తున్నారని టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News