: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్‌నగర్, ఎల్బీనగర్, కోఠీ, బేగంపేట, పంజాగుట్ట, బోయిన్‌పల్లి, బొల్లారం, కుషాయిగూడ, ఈసీఐఎల్, మల్కాజ్‌గిరి, కీసరలలో భారీ వర్షం కురిసింది. ఇక వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిగిలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. ఇబ్రహీంపట్నంలో రహదార్లు జలమయమయ్యాయి. తాండూరు, వికారాబాద్‌లలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి.