: ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’ అవార్డును అందుకున్న కేటీఆర్
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’ అవార్డును తెలంగాణ మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఢిల్లీలో సీఎన్ బీసీ నిర్వహించిన ఇండియా బిజినెస్ లీడర్ అవార్డు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. ఈ సందర్భంగా అవార్డును స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ ఎన్నో అవార్డులు వచ్చాయని, తెలంగాణ ప్రభుత్వ పాలనాదక్షతకు, సీఎం పనితీరుకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి ఈ అవార్డు అంకితమని, భవిష్యత్ లో దేశంలోనే ప్రథమ స్థానానికి ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీ వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గుర్తింపుతో పాటు, ఇచ్చిన హామీలను అమలు చేసే రాష్ట్రంగా కూడా గుర్తింపు తెచ్చుకుంటామని కేటీఆర్ అన్నారు.