: బిల్లు వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం రాకూడదు!: శాసనసభలో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై నష్టాలుంటాయని సీపీఎం పార్లమెంటులోనూ సూచించిందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈరోజు శాసనసభలో గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఈరోజు జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు తీర్మానంపై చర్చలో భాగంగా రాజయ్య మాట్లాడుతూ... జీఎస్టీ బిల్లుపై తమ నాయకుడు సీతారాం ఏచూరి పార్లమెంటులో పలు సూచనలు చేశారని అన్నారు. బిల్లు ద్వారా రాష్ట్ర హక్కులకు నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడతాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం విభజన చేసినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, బిల్లుని ఆమోదం చేసుకునే క్రమంలో రాష్ట్రాలకు పలు హామీలు ఇచ్చుండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం మన అవసరం కోసం వచ్చినప్పుడు మాత్రం మనతో సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. బిల్లు వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం కలగకూడదని ఆయన అన్నారు.