: జీఎస్టీ బిల్లు భారత ఆర్థిక సంస్కరణల్లో ఓ మైలురాయి.. సీఎం కేసీఆర్‌కి అభినందనలు: కిషన్‌రెడ్డి
తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్ ఈరోజు జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... జీఎస్టీ బిల్లు తీర్మానంపై చర్చను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. యావత్ దేశం బిల్లుని స్వాగతిస్తోందని ఆయన అన్నారు. జీఎస్టీ బిల్లు భారత ఆర్థిక సంస్కరణల్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. పన్నుల విధానంలో అక్రమాలు ఉండవని అన్నారు. జీఎస్టీ అంటే గ్రేట్ స్టెప్ బై టీమిండియా అని ప్రధాని అన్నారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. పారదర్శకత దిశగా ముందడుగు వేస్తున్నామని ఆయన అన్నారు. పన్నులంటే భయపడిపోయే తీరు ప్రజల నుంచి తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్నుల వసూలులో అవినీతిని అరికట్టేందుకు జీఎస్టీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బిల్లు వల్ల అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేంద్రం బిల్లుని అమలులోకి తేవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిల్లు ద్వారా 12 రకాల పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు. దేశ ఆర్ఠిక వ్యవస్థ గాడిలో పడనుందని ఆయన అన్నారు.