: విలన్‌గా మారిన కన్నడ హీరో.. సినిమాకు డబ్బుల కోసం కిడ్నాపులు.. పోలీసులకు చిక్కి కటకటాల్లోకి!
హీరో విలన్‌గా మారాడు. సినిమాలో కాదు, నిజజీవితంలో. తను హీరోగా తీస్తున్న సినిమాకు మరిన్ని డబ్బులు అవసరం కావడంతో దిక్కుతోచని ‘హీరో’ కిడ్నాప్‌కు తెరతీశాడు. అయితే పన్నాగం ఫలించకపోవడంతో పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. అతడిపై అప్పటికే బోల్డన్ని కేసులు ఉండడాన్ని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని సింగపుర లే అవుట్‌కు చెందిన మునియప్ప(28) ‘చాలెంజర్’ అనే కన్నడ సినిమాలో ఈశ్వర్ పేరుతో హీరోగా నటిస్తున్నాడు. మునియప్పతోపాటు అతడి స్నేహితుడైన హసన్ కూడా ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టాడు. అయితే మరిన్ని డబ్బులు కావాల్సి ఉండడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కిడ్నాపుల ద్వారా డబ్బులు సంపాదించాలని భావించారు. మరికొందరితో కలిసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఈనెల 24న కిర్లోస్కర్ ఎలక్ట్రికల్ కంపెనీ ఎండీ వినాయక్ బాపట్ కుమారుడు, ఇంజినీరింగ్ చదువుతున్న ఇషాన్(19)ను కిడ్నాప్ చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో భయపడి ఇషాన్‌ను వదిలిపెట్టారు. ఈ కేసును శోధించిన పోలీసులు మునియప్పతోపాటు హసన్ దొంగరి(26), జగదీశ్(32), జగన్నాథ(28), మనోజ్(19)లను కూడా అరెస్ట్ చేశారు. మునియప్పపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కుమార్తెను పెళ్లి చేసుకున్న మునియప్పపై అపహరణ కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత రాజీకి రావడంతో దానిని కొట్టివేశారు. మాజీ ఎమ్మెల్యే కూతురితో విడాకుల అనంతరం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చైన్ స్నాచింగ్ గ్యాంగులో చేరిన మునియప్పపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఓ దోపిడీ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. టీవీ ప్రోగ్రాములకు పనిచేస్తూ నేరాలకు పాల్పడేవాడు. అంతేకాదు, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని తెరిచి పలువురిని మోసం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అతడి మోసాలకు అంతే లేదని పోలీసులు పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే.. అతడి ‘చాలెంజ్’ చిత్రానికి ‘విజయం కోసం పోరాటం’ అని ట్యాగ్ లైన్ ఉండడం.