: పవన్ కల్యాణ్ పై టీజీ వెంకటేష్ విపరీత వ్యాఖ్యలపై బోండా ఉమ అసంతృప్తి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ నేతలు విపరీత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శలు గుప్పించడంపై ఉమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీలో ఉండి టీజీ వెంకటేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రత్యేకహోదాపై ఏపీ ప్రభుత్వం ఏ విధమైన పోరాటం చేస్తుందో, అదే విషయాన్ని పవన్ కల్యాణ్ తిరుపతిలో చెప్పారని, ఆ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. ప్రత్యేకహోదాపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని బోండా ఉమ అన్నారు.