: పార పట్టుకుని తిరగడమే పారదర్శకతా... నారాయణా? అసలు ఆ 474 కోట్లు ఎక్కడి నుంచొచ్చాయి?: ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తనకు 474 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారని, అంత ఆస్తి ఎలా వచ్చిందో ఆయన వివరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, మంత్రి నారాయణను అంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకి కుడి, ఎడమ చేతులని అంటుంటారని, ఈ లెక్కన అమరావతి స్కాం సూత్రధారి నారాయణేనా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ అనుమానాలు తొలగిపోవాలంటే ఆయన తన 474 కోట్ల ఆస్తుల గుట్టు విప్పాలని సూచించారు. చంద్రబాబునాయుడు పదేపదే సింగపూర్ వెళ్లడం వెనుక కారణం...దొంగ సొమ్ము దాచుకునేందుకు అనువైన ప్రాంతాల జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, సింగపూర్ నాలుగవ స్థానంలో ఉండడమే కారణమా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నారాయణ పారదర్శకత, పారదర్శకత అని పదేపదే చెబుతుంటారని, పారపట్టుకుని తిరగడమే పారదర్శకతా? అని ఆయన నిలదీశారు. అలాగే చంద్రబాబు తాను నిప్పు అని చెబుతుంటారని, రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే మీరెంత నిప్పో అందరూ చూశారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టు ఆయన రేవంత్ రెడ్డి కాదని అనుకుందామని, అయితే కేసీఆర్ ఎవరికి రేవంత్ రెడ్డి వేషం వేసి ఆ డబ్బులు పంపించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సాధారణంగా ఏదైన పని మొదలుపెడితే అంతా 'నారాయణా' అని మొదలు పెడతారని, మంత్రి నారాయణ తన ఆస్తులు వెల్లడించడం ద్వారా శుభకార్యం ప్రారంభించాలని ఆయన సూచించారు. తాను డాక్యుమెంట్ల ఆధారంగానే ఈ వివరాలు చెబుతున్నానని, నారాయణ ఏ వ్యాపారం చేసి ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. సొసైటీలకు భారీ ఎత్తున ఆస్తులు ఉండవచ్చని, అయితే సొసైటీలు నడిపే వ్యక్తులకు అంతపెద్ద మొత్తంలో ఆస్తులు ఉండవని, సొసైటీ ఆస్తులను సొంత ఆస్తులుగా అనుభవిస్తున్నారని, సొసైటీ చట్టం ప్రకారం లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలను నడపాలని ఆయన తెలిపారు. అమరావతి రాజధాని ఏ నివేదిక ఆధారంగా నిర్మిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో ఏం చెప్పిందో ఎవరైనా చెప్పగలరా? అని ఆయన నిలదీశారు. గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య రాజధాని నిర్మాణం వద్దని శివరామకృష్ణన్ కమిటీ తెలిపిందని, ఆయన మరణానికి ముందు ఒక లేఖ కూడా రాశారని, అది జాతీయ మీడియాలో ప్రసారమైందని ఆయన గుర్తు చేశారు. ఆ కమిటీ నివేదికను కాదని, వ్యాపారవేత్తలైన నారాయణ, జీఎంఆర్, బీవీ రాజు, గల్లా జయదేవ్, సుజనా చౌదరితో కమిటీ వేసి రాజధాని అమరావతి అని చెప్పించారని ఆయన విమర్శించారు. ఇవన్నీ మాట్లాడుతున్నందున తనను ఊసరవెల్లి అంటూ విమర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.