: మరో శివగామి... వరద నీటిలో బిడ్డను పైకెత్తి పట్టుకుని కాపాడి, ప్రాణాలు వదిలిన కన్నతల్లి
నిలువెత్తున పారుతున్న నీటిలో బిడ్డ ప్రాణాలను కాపాడాలన్న తపనతో తన ప్రాణాలు వదిలేసిన 'బాహుబలి' శివగామి గుర్తుందిగా? దాదాపు అటువంటి ఘటనే యూఎస్ లోని కొలరాడోలో జరిగింది. వరద నీటిలో పడిపోయిన తన రెండేళ్ల కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను వదిలిందో తల్లి. కొలరాడోను వరద నీరు చుట్టుముట్టిన వేళ ఛెల్సీ రస్సెల్ (33) అనే మహిళ తన రెండేళ్ల కుమారుడు పోవెల్, కుటుంబంతో కలసి హౌస్ బోట్ లోకి ఎక్కేశారు. వరద నీటి ధాటికి పోవెల్ నీటిలో పడిపోగా, ముందూ వెనుకా ఆలోచించకుండా రస్సెల్ నీటిలో దూకేసింది. బిడ్డను చేరుకుంది గానీ, నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంటే ఏం చేయాలో పాలుపోలేదు. బిడ్డను గాల్లో ఉంచుతూ, తాను నీటిలో ఉండిపోయింది. కుటుంబ సభ్యులు హౌస్ బోట్ ఆపి, మరో బోటులో వారి దగ్గరకు చేరి, తల్లీ బిడ్డలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించే సరికే ఆమె మరణించింది. బాబు క్షేమంగా ఉన్నాడు.