: కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేత.. సాధారణ స్థితికి చేరుకుంటున్న లోయ
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు 50 రోజులపాటు లోయలో కొనసాగుతూ వస్తున్న కర్ఫ్యూను ప్రభుత్వం ఎత్తివేసింది. చెదురుమదురు ఘటనలు మినహా కశ్మీర్ ప్రశాంతంగా ఉంది. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. జూలై 8న ఉగ్రవాది వనీ ఎన్‌కౌంటర్ తర్వాత లోయలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 60 మందికిపైగా చనిపోగా మరెందరో గాయపడ్డారు. కర్ఫ్యూ, ఆంక్షలను చాలా ప్రాంతాల్లో ఎత్తివేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. చాలా ప్రాంతాల్లో సెక్యూరిటీ బలగాలను మోహరించలేదని పేర్కొన్నారు. అయితే అనంత్‌నాగ్‌లో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న తర్వాత కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నట్టు వివరించారు.