: శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిసిన ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి.. కశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణపై చర్చ


భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓల్) వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిశారు. శనివారం బెంగళూరులోని ఆయన ఆశ్రమంలో సమావేశమైన ముజఫర్ వనీ ప్రస్తుతం కశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన లోయలో తిరిగి శాంతి పునరుద్ధరణ మార్గాల గురించి ఇరువురూ మాట్లాడుకున్నట్టు ఏఓల్ అధికార ప్రతినిధి తెలిపారు. రవిశంకర్‌ను ముజఫర్ వనీ కలుసుకున్నట్టు ఏఓల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. ‘‘గత రెండు రోజులుగా ముజఫర్ వనీ ఆశ్రమంలోనే ఉన్నారు. చాలా విషయాల గురించి చర్చించాం’’ అని ఏవోల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ఈ కలయిక ప్రభుత్వ చొరవతో జరగలేదని స్పష్టం చేశారు. జూన్ 2015లో శ్రీశ్రీ రవిశంకర్ కొలంబియా ప్రభుత్వానికి, లెఫ్ట్ గెరిల్లా గ్రూప్ ఎఫ్ఏఆర్‌సీకి మధ్య జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. రవిశంకర్ చొరవతో ఏఫ్ఏఆర్‌సీ తన లక్ష్యాల కోసం హింసను విడనాడి గాంధీ మార్గాన్ని ఎంచుకుంది.

  • Loading...

More Telugu News