: మన వల్లే గెలిచి...నవ్వుతూ మన రాష్ట్రాన్నే ముక్కలు చేశాడు... జైరాం రమేష్ కు జైకొట్టండి!: పవన్ కల్యాణ్ సెటైర్
మన రాష్ట్రం నుంచి, మన నేతల సహాయంతో గెలిచిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ నవ్వుతూ మన రాష్ట్రాన్నే ముక్కలు చేశాడని, అలాంటి జైరాం రమేష్ కు అంతా జై కొట్టాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, మా తెలుగు రాష్ట్రాన్ని, మా తెలుగు ప్రజలను ఇంత చక్కటి వాతావరణంలో విడగొట్టినందుకు ఆయనకు ధన్యవాదాలని వ్యంగ్యంగా అన్నారు. అలాంటి వ్యక్తికి అందరూ చప్పట్లు కొట్టాలని, ఆయన సభికులతో చప్పట్లు కొట్టించారు. రాష్ట్ర విభజన కోసం తెలంగాణ ఎంపీలు ఎంత గట్టిగా పోరాడారో, ఎంత మందిని ధిక్కరించారో, ఎంత బలంగా రాష్ట్ర విభజన వాదన వినిపించారో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. అప్పట్లో ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పోరాడలేదని, సోనియా గాంధీ ముందుకు వెళ్లి మేడమ్, మేడమ్ అంటూ బతిమాలేవారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటాన్ని ఏపీకి చెందిన ఎంపీలు ఎందుకు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. సమస్య ఎక్కడుంది? ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు చదువుకోలేదా? కేంద్రం ముందు ఎందుకు సాగిలపడుతున్నారు? సార్ సార్ అంటూ ఎన్ని సార్లు అడుక్కుంటారు? మీరెందుకు అంతలా లొంగిపోతున్నారు? మీకు సిగ్గులేదు, గౌరవం లేదు, గులాంగిరీ చేస్తున్నారా? అందుకే అక్కడికెళ్లారా? పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల హక్కుల కోసం పోరాడండి అని ఆయన సూచించారు. 'పోరాడండయ్యా, ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం తాకట్టుపెట్టకండి' అని ఆయన సూచించారు.