: సిగ్గు లేదయ్యా...పార్లమెంటుని స్తంభింపచేయండి: పవన్ కల్యాణ్
ఏపీకి ప్రత్యేకహోదా కోసం మూడు దశలుగా పోరాడుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ, ఈ పోరాటంలో భాగంగా తన తొలిఅడుగు బీజేపీ ఎక్కడైతే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించిందో అదే కాకినాడ నడిబొడ్డు నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకపోతే, స్టార్టప్ ఇండియా అని చెప్పి కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి రాయితీలు ఇవ్వకపోతే మా భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆయన అడిగారు. అంటే మీ పథకాలు మాటలకే పరిమితమా? అని ఆయన నిలదీశారు. చేతల్లో చూపించరా? అని అడిగారు. ఇప్పటి వరకు మీ పథకాలతో నిరుద్యోగులు, విద్యార్థుల్లో స్కిల్స్ పెంచడానికి ఏం చేశారు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీ రెండు జాతీయ పార్టీలు ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 16,500 కోట్లా? అని ఆయన అడిగారు. ఇలా మీరు నిధులు ఇస్తే... ఏపీ ఏనాటికి ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా తయారవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? అని ఆయన అన్నారు. విభజన సమయంలో పదో తరగతి చదివిన వాడు మరో పదేళ్లకు డిగ్రీ చేతబట్టి బయటికెళ్తే నిరుద్యోగిగానే మిగలాలా? అని ఆయన అడిగారు. మోదీతో వ్యక్తిగత పరిచయం ఉంది కదా... ఆయనను వ్యక్తిగతంగా కలిసి అడిగితే బాగుంటుంది కదా? అని పలువురు తనను ప్రశ్నిస్తుంటారని, అయితే తాను వ్యక్తిగతంగా ఆయనను అడిగితే... తనకు మాత్రమే ఏదో చేస్తానని చెబుతారని, అలా కాకుండా నేరుగా నేతలు ప్రజలకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా లాంటి ప్రజాసమస్యపై ప్రజా పోరాటం ద్వారా సత్ఫలితాలు సాధించగలమని ఆయన చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమే బాగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. మిగిలిన వారికి ఏమవుతోందని ఆయన అడిగారు. మరి టీడీపీ ఏపీకి స్పెషల్ స్టేటస్ పై పోరాటాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతోంది? అని నిలదీశారు. తాము ఏమన్నా అంటే తమకు కూడా కేంద్రం మీద కోపం, కసి ఉన్నాయని, అయితే కేంద్రంతో పోరాడితే నిధులు రావని సాకు చెబుతున్నారని ఆయన అన్నారు. ఇలా సాకులు చెబుతూ పోతే... కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా పదే పదే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతుంటే ఎంపీలు ఎన్నిసార్లు సార్ సార్ అంటూ వారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారని ఆయన వారిని నిలదీశారు. ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు మాట్లాడితే విసుగు, అసహనం వస్తున్నాయని ఆయన చెప్పారు. విభజన సమయంలో వెంకయ్యనాయుడు పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా పదేళ్లు కావాలి అని అడిగారని, ఎన్నికల సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తుందని పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. వెంకయ్యనాయుడుగారు వమసు, రాజకీయాల్లో చాలా పెద్దవారని ఆయన చెప్పారు. అలాంటి వ్యక్తి అలా మాట్లాడడం సరికాదని ఆయన చెప్పారు. దయచేసి ఆయన అలా అనవద్దని ఆయన కోరారు. వెంకయ్యనాయుడు రాజకీయ అనుభవం అంత తన వయసు లేదని అన్నారు. అయినప్పటికీ తాను స్పష్టంగా చెప్పేదేంటంటే... 'సర్ మీరు అలా మాట్లాడకండి' అని సూటిగా చెప్పారు. ప్రజలంతా ప్రత్యేకహోదా కోరుతుంటే మీరు మాట్లాడే విధానం సరికాదని ఆయన చెప్పారు. మొదట మీరు తెలుగువారని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. తెలుగు ప్రజల తరపున కేంద్రంతో పోరాడాల్సిన అవసరముందని ఆయన గుర్తించాలి. వెంకయ్యనాయుడు సాధించాలని అనుకుంటే ఆయనకు ఇది పెద్ద విషయం కాదని ఆయన చెప్పారు. జైట్లీ, వెంకయ్య నాయుడు మాటలు, అంకెల గారడీలు చెప్పడం మానేయాలని ఆయన చెప్పారు. ఈ లెక్కలు తమకు చెప్పవద్దని ఆయన స్పష్టం చేశారు. అన్ని లెక్కలూ కలిపితే 32 వేల కోట్లు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంకా తెలుగు ప్రజలకు అసహనం తెప్పించే కధలు చెప్పడం మానేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మీకు సిగ్గులేదా? పార్లమెంటును స్తంభింపజేయండని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.