: బహుమతిగా అందుకున్న బీఎండబ్ల్యూ కార్లను 24 గంటల్లో అమ్మకానికి పెట్టిన రియో విజేతలు
బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందుకున్న 24 గంటల్లో రియో విజేతలు ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టడం రష్యాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించి, దేశ పరువు ప్రతిష్ఠలు ఇనుమడింపజేసిన క్రీడాకారులను ఆయా దేశాలు స్థాయికి తగ్గరీతిలో సత్కారాలు, బహుమతులతో అభినందిస్తున్నాయి. రష్యా ప్రభుత్వం కూడా పతకాలు సాధించిన క్రీడాకారులను సత్కరించింది. ఈ సందర్భంగా వివిధ సంస్థలు పతక విజేతలకు లగ్జరీ బహుమతులు అందించాయి. అందులో బీఎండబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయి. అయితే బహుమతులు అందుకున్న 24 గంటల్లోనే పలువురు క్రీడాకారులు ప్రముఖ సోషల్ మీడియా సైట్లలో వాటిని అమ్మకానికి పెట్టారు. ఇది రష్యాలో పెను కలకలం రేపుతోంది. ఇలా బహుమతులుగా వచ్చిన వాటిని వెంటనే అమ్మకానికి పెట్టడమేంటని పలువురు, ఇప్పటికిప్పుడు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం బహుమతులను ఏం చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది క్రీడాకారులేనని అభిప్రాయపడుతున్నారు. వీటిపై బీఎండబ్ల్యూ కార్లను అమ్మకానికి పెట్టిన సెదా తుల్యాఖాన్ మాట్లాడుతూ, తనకు 17 ఏళ్లని, ఇంకా తనకు లైసెన్స్ రాలేదని, అయినా తనకు బీఎండబ్ల్యూ కారుకు డ్రైవర్ ను పెట్టుకునే స్తోమత కూడా లేదని, అందుకే అమ్మకానికి పెట్టానని తెలిపింది. 2014 వింటర్ ఒలింపిక్స్ పతక విజేత మాక్సిం ట్రంకోవ్ మాట్లాడుతూ, ఇంతకు ముందు ఒక కారు ఉన్నవారు ఇలా వచ్చిన కారును ఏం చేసుకోవాలని అడిగాడు. అతనితో పలువురు క్రీడాకారులు కూడా గొంతుకలుపుతూ, ఇలా చేయడం వల్ల వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నిస్తున్నారు.