: 'ఐ 10' వార్తా చానల్ నయీమ్ దే... రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతో భారీ పెట్టుబడి!
రాజకీయంగా ఆధిపత్యం చెలాయించాలంటే, ముందు మీడియా ద్వారా పాప్యులర్ కావాలని భావించిన నయీమ్, తన సొంత పెట్టుబడులతో ఐ10 న్యూస్ చానల్ ను ప్రారంభించాడని, పేరుకు మాత్రమే సీఈఓగా హరిప్రసాద్ రెడ్డిని నియమించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిన్న హరిప్రసాద్ ను అరెస్ట్ చేసి విచారించగా, పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. సమాజం, ప్రజలు తనను హీరోగా భావించాలన్నది నయీమ్ అభిమతమని, మానవత్వం చూపే నేతగా కనిపించాలన్న ఆశతో, మీడియాను మార్గంగా ఎంచుకున్నాడని హరిప్రసాద్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. గతంలో పలు పత్రికలు, టీవీ చానళ్లలో పనిచేస్తున్న సమయంలో నయీమ్ పై తాను వ్యతిరేక వార్తలు రాశానని, వాటితోనే నయీమ్ తో తనకు పరిచయం ఏర్పడిందని హరిప్రసాద్ వెల్లడించాడు. తొలుత తనను బెదిరించినా, ఉర్సు ఉత్సవాల్లో నయీమ్ సోదరులకు మంచి కవరేజ్ ఇచ్చినందుకు లక్ష రూపాయల డబ్బిచ్చాడని, ఆపై ముస్లిం యువత ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి ప్రచారం కోసం లక్ష ఇచ్చాడని హరి అంగీకరించాడు. తనను నమ్మిన నయీమ్, ఐఫోన్ కూడా ఇచ్చాడని, న్యూస్ చానల్ పెట్టాలని చెప్పి రూ. 13.50 లక్షలు ఇచ్చాడని, ఆ డబ్బుతోనే చానల్ కు అనుమతులు సంపాదించి, బంజారాహిల్స్ లో ఆఫీసు మొదలు పెట్టానని తెలిపాడు. జిల్లాల వారీగా న్యూస్ చానల్ ఫ్రాంచైజీలు విక్రయించాలని భావించి రూ. 5 లక్షలు తీసుకుని వరంగల్ జిల్లాను వెంకటేశ్ అనే వ్యక్తికి విక్రయించామని పేర్కొన్నాడు. తెలంగాణలో చానల్ విజయవంతమైతే, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనూ టీవీ చానల్స్ ప్రారంభించాలన్నది నయీమ్ అభిమతమని తెలిపాడు. ఇటీవల ఓ మంత్రి బర్త్ డే సందర్భంగా ఆయనపై పాట తయారు చేయించి, దానికి విజువల్స్ కోసం రూ. 1.50 లక్షలు నయీమ్ ఇచ్చాడని, చానల్ ప్రసారాలు మొదలు కాకపోవడంతో దాన్ని సామాజిక మాధ్యమాల్లో మాత్రమే ఉంచామని చెప్పాడు.