: యూపీ కోసం కదిలిన రాహుల్... 25 రోజుల మ్యాసివ్ టూర్ లో 45 జిల్లాల పర్యటన


వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 25 రోజుల పాటు ఏకధాటిగా రోడ్ షో నిర్వహించడం ద్వారా 42 జిల్లాల్లోని సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను చుట్టి రావాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలను ఉత్తేజితం చేయడమే లక్ష్యంగా రాహుల్ పర్యటన సాగనుందని తెలుస్తోంది. యూపీ తూర్పు ప్రాంతంలోని డియోరియా నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే రాహుల్ యాత్ర పడమర ఉన్న నోయిడాతో ముగుస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేత రాజ్ బబ్బర్ దగ్గరుండి పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. కాగా, రాజ్ బబ్బర్ తో పాటు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని షీలా దీక్షిత్ ప్రస్తుతం యూపీ జిల్లాలను చుట్టి వచ్చే పనిలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. దశాబ్దాల క్రితం యూపీలో దూరమైన అధికారాన్ని ఈ దఫా ఎలాగైనా తిరిగి చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి కసరత్తే చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఆ పార్టీ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News