: పురిటి నొప్పులతో బాధపడుతూ వరద నీటిలో ఆరు కిలోమీటర్ల నడక.. అడ్రస్ లేని ‘జనని ఎక్స్‌ప్రెస్’


ఆస్పత్రి అధికారులు వాహనం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఒడిశాలో ఓ గిరిజనుడు భార్య శవాన్ని భుజంపై మోస్తూ దాదాపు 10 కిలోమీటర్లు నడిచిన ఘటన మర్చిపోకముందే అటువంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లేందుకు ఏకంగా ఆరు కిలోమీటర్లు నడిచింది. ఛత్తర్‌పూర్‌లోని టిమారియా గ్రామానికి చెందిన సంధ్య యాదవ్(28) నిండు గర్భిణి. శుక్రవారం ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జనని ఎక్స్‌ప్రెస్’ అంబులెన్స్ కోసం కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. గంటలు గడుస్తున్నా అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు నడక ప్రారంభించారు. సంధ్య పురిటి నొప్పులతో విలవిల్లాడుతూనే వరద నీటిలో ఆరు కిలోమీటర్లు నడిచింది. ఆమెకు తోడుగా మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి ఉచితంగా తీసుకెళ్లి, ప్రసవానంతరం తిరిగి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘జననీ ఎక్స్‌ప్రెస్’ పేరుతో ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రారంభించింది. అంబులెన్స్ కోసం తాము అధికారులకు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదని, దీంతో నడవక తప్పలేదని సంధ్య బంధువులు పేర్కొన్నారు. ఆరు కిలోమీటర్ల మేర నడక సాగించినా ఎక్కడా అంబులెన్స్ తమకు తారసపడలేదని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు జిల్లా వైద్యాధికారి బీకే గుప్తా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News