: జీఎస్టీ బిల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కోసం ఈనెల 30 నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు
వస్తు సేవల పన్ను(జీఎస్టీ)బిల్లుని ఆమోదించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. బిల్లు ఆమోదం కోసం శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉభయసభలను సమావేశపర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలను వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తారు. సమావేశాలకు ఏజీ రామకృష్ణారెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారితో కేసీఆర్ చెప్పారు. జీఎస్టీ బిల్లుని ఇప్పటికే అస్సాం, బీహార్, జార్ఖండ్, చత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆమోదించిన విషయం తెలిసిందే. జీఎస్టీ బిల్లు అమలుతో రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని కేంద్రం తెలిపిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవలే మీడియాకు తెలిపారు.