: పాకిస్థాన్ పై అంత మోజుంటే కాశ్మీర్ వీడండి...మెహబూబా ముఫ్తీ స్వరంలో పెరిగిన తీవ్రత
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ స్వరం మారింది. గతంలో అల్లర్లు జరిగిన సమయంలో కాశ్మీరీ ప్రజలది తప్పులేదనిపించేలా మాట్లాడిన ముఫ్తీ వాస్తవాలు నెమ్మదిగా గ్రహిస్తున్నారు. దీంతో గత నెల రోజులుగా చోటుచేసుకుంటున్న అంశాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె కీలకమైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత అల్లర్లలో గాయపడ్డవారిపై ఆమె మండిపడ్డారు. వారేమైనా పాలు, పళ్లు కొనుగోళ్లకు వెళ్లి గాయపడ్డారా? అని కాశ్మీరీలను ప్రశ్నించారు. వాస్తవాలు గ్రహించాలని ప్రజలకు సూచించారు. వేర్పాటు వాదులు కాశ్మీరీలను అభివృద్ధి చెందనీయడం లేదని, అంతా అభివృద్ధి చెందితే వారి ఆటలు సాగవన్న ఆలోచనతో జమ్మూకాశ్మీర్ ను నిత్యం రావణకాష్టంలా రగులుస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ పై అంత ప్రేమ ఉంటే కాశ్మీర్ ను వదిలి వెళ్లాలని ఆమె వేర్పాటువాదులకు స్పష్టంగా సూచించారు. కాశ్మీర్ ను మరో ఆఫ్ఘనిస్థాన్ గా మారుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఉరితీస్తూ, జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులను ప్రోత్సహించడం సరికాదని ఆమె ఆయనకు హితవు పలికారు. అమాయక ముస్లిం ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని ఆమె సూచించారు. 2010లో జరిగిన అల్లర్లు ఫేక్ ఎన్ కౌంటర్ కారణంగా చెలరేగితే...ఇప్పటి అల్లర్లు తీవ్రవాదులను ఎన్ కౌంటర్ చేయడం ద్వారా చెలరేగాయని, ఇది సరైన విధానం కాదని ఆమె కేంద్రాన్ని వెనకేసుకొచ్చారు. పాకిస్థాన్ నేతలు, ఉగ్రవాదులు, వేర్పాటు వాద సంస్థల మాయమాటల్లో పడవద్దని ఆమె ప్రజలకు సూచించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు పుకార్లు రేపుతున్నారని, అలాంటి ఆరోపణలపై కూడా ప్రభుత్వం విచారణ చేయిస్తుందని ఆమె తెలిపారు. ప్రజలు సంయమనం పాటించి జనజీవనం స్తంభించకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు.