: బాంబే హైకోర్టు తీర్పుతో సంబరాలు చేసుకున్న తృప్తీదేశాయ్.. తదుపరి లక్ష్యం శబరిమలట!
ముంబయిలోని ప్రసిద్ధ హజి అలీ దర్గాలోనికి మహిళలను అనుమతిస్తూ బాంబే హైకోర్టు ఈరోజు చారిత్రాత్మక తీర్పునిచ్చిన అంశంపై భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ తమ సంస్థ కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపిన విషయం తెలిసిందే. లింగభేదాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగిస్తోన్న తృప్తీ దేశాయ్ కోర్టు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముంబయిలో ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే ఆ దర్గాకు వెళ్లనున్నట్లు తెలిపారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను ఆలయాల్లోకి అనుమతించకుండా నిబంధనలు పెడుతున్నవారికి కోర్టు తీర్పు చెంపపెట్టు అని తృప్తీదేశాయ్ అన్నారు. మహిళా శక్తి సాధించిన ఓ గొప్ప విజయంగా హైకోర్టు తీర్పును ఆమె అభివర్ణించారు. తమ తదుపరి లక్ష్యం శబరిమలలో ప్రవేశం సాధించడమేనని అన్నారు.