: భారతీయులు మౌనంగా ఉన్నారెందుకు...మరోసారి రెచ్చగొట్టిన బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్
వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ తో మౌనం దాల్చాల్సిన బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ మరోసారి భారతీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రియోలో రెండు పతకాలు సాధించినందుకే భారత్ సంబరాలు చేసుకుంటోందని ఆరోపణలు చేసిన మోర్గాన్ పై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా అతనికి గుర్తింపుతోపాటు, ట్విట్టర్ ఫాలోయర్లు కూడా పెరిగారు. అయితే సెహ్వాగ్... క్రికెట్ కనిపెట్టామని చెప్పుకునే ఇంగ్లండ్, ఇంకా వరల్డ్ కప్ ను గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేయడంతో ఆయన అవాక్కైన సంగతి తెలిసిందే. దీంతో మౌనం దాల్చిన మోర్గాన్... భారతీయులు మౌనంగా ఎందుకున్నారు?...మీ గాయాలకు మందు పూసుకుంటున్నారా? అని ఎద్దేవా చేసే ప్రయత్నం చేశాడు. ఒక్కరోజులో తన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 12 వేలు పెరిగిందని, ఇదంతా భారతీయుల వల్లేనని మోర్గాన్ అన్నాడు. దీనిపై నెటిజన్లు ఏమంటారో చూడాలి.