: జనసేనాధిపతి ప్రసంగం దేనిమీదనో?... అందరి దృష్టి పవన్ కల్యాణ్ మీదే!
తిరుపతిలో జనసేనాధిపతి, టాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారో? రాజకీయాలపై మాట్లాడతారా?... లేదంటే హద్దులు దాటిపోయిన అభిమానంపై గొంతు విప్పుతారా?... తెలుగు నేలలో ఏ ఇద్దరు కూడిన చోటైనా ఇదే చర్చ. అన్ని న్యూస్ ఛానెళ్లలోనూ దీనిపైనే వార్తా కథనాలు. వెరసి రేపు సాయంత్రం తిరుపతిలోని ఇందిరా మైదానంలో జరగనున్న బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రస్తావించే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్ణాటకలోని కోలార్ లో టాలీవుడ్ యంగ్ హీరో ఫ్యాన్స్ దాడిలో చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న తిరుపతి వచ్చిన ఆయన ప్రస్తుతం తిరుమల కొండపై తన అనుచరులతో చర్చోపచర్చలు సాగిస్తున్నారు. నేటి ఉదయం నుంచి కొనసాగుతున్న చర్చలపై నెలకొన్న సస్పెన్స్ కొద్దిసేపటి క్రితం వీడింది. రేపు తిరుపతిలో జరగనున్న జనసేన బహిరంగ సభకు పోలీసుల నుంచి అనుమతి రాగా, యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.