: చంద్రబాబు సహకరించకుంటే ఏపీ ప్రగతి సాధ్యం కాదు: బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటేనే ప్రగతి సాధ్యమని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు సహకరించాల్సి ఉందని, ఆయన కలసిరాకుంటే అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని, ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వెల్లడించిన హరిబాబు, రాష్ట్రానికి నిబంధనల ప్రకారం నిధులు విడుదలవుతాయని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో కేంద్రీయ విద్యాలయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పార్లమెంట్ లో చట్టం చేయాల్సి వుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించడం సరికాదని హితవు పలికారు.