: ఓర్లాండో నైట్‌క్లబ్ కాల్పుల బాధితులకు వైద్యం ఫ్రీ.. పైసా కూడా వసూలు చేయబోమన్న ఆస్పత్రులు


అమెరికాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో గాయపడి ఓర్లాండో హెల్త్‌కు చెందిన రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఒక్కపైసా కూడా వసూలు చేసే ఉద్దేశం లేదని ఆస్పత్రి యాజమాన్యాలు తెలిపాయి. చికిత్స కోసం 5 మిలియన్ డాలర్లకుపైగా ఖర్చయినా వారి నుంచి ఒక్క డాలరు కూడా వసూలు చేసే ఉద్దేశం లేదని పేర్కొన్నాయి. ఈ దాడి బాధితులకు, వారి కుటుంబ సభ్యులనే కాక మొత్తం దేశాన్నే విషాదంలోకి నెట్టివేసిందని ఓర్లాండో హెల్త్ అధ్యక్షుడు, సీఈవో డేవిడ్ స్ట్రాంగ్ తెలిపారు. జూన్ 12న ఓర్లాండో నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో 49 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన 53 మంది క్షతగాత్రులకు ఈ రెండు ఆస్పత్రులు అత్యవసర వైద్య సదుపాయం అందించాయి. బాధితుల నుంచి కానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఓర్లాండో హెల్త్ నేరుగా బిల్లులు వసూలు చేయదు. ఫెడరల్ ఫండ్స్, ప్రైవేటు ఇన్స్యూరెన్స్, డిజేబులిటీ ఇన్స్యూరెన్స్, స్టేట్స్ క్రైమ్ కంపెన్సేషన్ ప్రోగ్రాం ద్వారా బిల్లులు సేకరించాలని ఓర్లాండో హెల్త్ భావిస్తోంది. డజను మంది క్షతగాత్రులకు చికిత్స అందించిన ఫ్లోరిడా ఆస్ప్రతి కూడా ఇటువంటి ప్రకటనే చేసింది. బాధితుల నుంచి పైసా కూడా వసూలు చేయబోమని పేర్కొంది. వారి ఇన్స్సూరెన్స్‌లు క్లైమ్ చేసే ఉద్దేశం లేదని వివరించింది.

  • Loading...

More Telugu News