: ఛత్తీస్ గఢ్ లో శిక్షణ పొందుతున్న పోలీసు అధికారిణులతో డీఎస్పీ విపరీత చేష్టలు!
ఛత్తీస్ గఢ్ లోని చంఖూరీ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పోలీస్ అధికారిణులతో వారి ట్రైనర్ అసభ్యంగా ప్రవరిస్తున్న సంఘటన వెలుగుచూసింది. ఔట్ డోర్ ఇన్ ఛార్జ్, డీఎస్పీ నీలకాంత్ సాహుపై ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని సదరు బాధిత అధికారిణులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు అధికారి మాటలు, ప్రవర్తనతో సిగ్గుతో చితికి పోతున్నామంటూ ఆ ఫిర్యాదులో ఆరోపించారు. శిక్షణ పొందుతున్న ఒక మహిళాధికారి బెల్టు క్రింది భాగంలో ఆయన కర్రతో పొడిచారని, స్విమ్మింగ్ పూల్ లో శిక్షణ పొందుతున్న మహిళల జుట్టు పట్టుకుని పైకి లాగుతున్నారని, ఇటువంటి వేధింపులు తమకు ప్రతిరోజూ తప్పడం లేదని ఆరోపించారు. మహిళలు సిగ్గుతో చితికిపోయే మరో అంశమేమిటంటే.. వారి నెలసరి తేదీలను సాహు నమోదు చేసుకుంటున్నారని, కిందటి నెలకు, ఈ నెలకు నెలసరిలో తేడా ఉందంటూ అరుస్తూ సిగ్గుతో తలదించుకునేలా సాహు ప్రవర్తిస్తున్నాడని పోలీస్ అధికారిణులు ఆరోపించారు. అంతేకాకుండా, రుతుస్రావం జరిగిన మహిళాధికారిణులను శిక్షణకు అనుమతించడం లేదని, పోలీస్ అకాడమీ నిబంధనల ప్రకారం ఈ విధంగా చేసే అధికారం ఆయనకు లేదని ఆరోపించారు. గర్భిణి అయిన మరో అధికారిణితో కూడా సాహు అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. కాగా, ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు సాహును హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ లైన్స్ కు తరలించారు. ఈ సందర్భంగా ఛత్తీస్ గఢ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ హర్షిత పాండే మాట్లాడుతూ, తమ కమిషన్ ప్రతినిధి బృందం ఈ అకాడమీని సందర్శించిందని, శిక్షణ పొందుతున్న మహిళా అధికారిణుల నుంచి ఫిర్యాదులు నమోదు చేశామని చెప్పారు.