: సిద్ధూ అమెరికాలో ఉన్నారు.. ఆప్‌లో చేరికపై నిర్ణయం తీసుకోలేదు: సిద్ధూ సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్
బీజేపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆమ్ఆద్మీ పార్టీలో చేరతారా.. లేరా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆస్తక్తి నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై స్వయాన ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఇటీవలే స్పందిస్తూ.. సిద్ధూ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము సానుకూలంగానే స్పందిస్తామని చెప్పారు. ఈ అంశంపై సిద్ధూ సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ తాజాగా స్పందిస్తూ.. ఓ కార్పోరేట్ సంస్థ ఉద్యోగులకు ప్రేరణ ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధూ అమెరికా వెళ్లారని చెప్పారు. ఆప్‌లో చేరికపై ఆయన ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. ఆయన భారత్‌కు చేరుకున్నాక ఈ అంశంపై స్పష్టత ఇస్తారని తెలిపారు. ఇదిలావుంచితే, ఆప్ పెట్టిన నిబంధనల ఫలితంగానే సిద్ధూ ఆ పార్టీలో చేరే అంశంలో ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికే టికెట్ ఇస్తామని ఆప్ పెట్టిన నిబంధనే సిద్ధూ ఫ్యామిలీకి నచ్చడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని కూడా సిద్ధూ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధూని తమ వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.