: ఒడిశాలో హృదయ విదారకం... భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కాలినడకన బయలుదేరిన భర్త!
అనారోగ్యంతో మృతిచెందిన తన భార్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు డబ్బుల్లేక, భుజాన వేసుకుని 60 కిలోమీటర్లు నడిచేందుకు నిర్ణయించుకున్నాడో భర్త. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగింది. నిజానికి ఒడిశాలో మృతదేహాలను వారి ప్రాంతాలకు ఉచితంగా చేర్చేందుకు 'మహాపారాయణ' అనే పథకం అమలవుతోంది. తాజా ఘటన వివరాల్లోకి వెళితే, మేఘారా అనే గిరిజన గ్రామానికి చెందిన దనమాజి భార్య అమాంగ్ దేయి కొంతకాలంగా క్షయతో బాధపడుతోంది. వ్యాధి ముదరడంతో, ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి ఆమె మరణించింది. మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి అధికారులు సహకరించలేదు. దీంతో ఆమెను బట్టల్లో చుట్టి, తన గ్రామానికి కాలినడకన బయలుదేరాడు. విషయం తెలుసుకున్న మీడియా, వెంటనే ఆ వార్తను ప్రత్యక్ష ప్రసారం చేసింది. దాదాపు 10 కిలోమీటర్లు నడిచిన తరువాత, కలెక్టరుకు విషయం తెలిసి, వాహనాన్ని ఏర్పాటు చేయించారు. నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.