: ఒలింపిక్ విజేత సాక్షి మాటలు విందామని వెళితే... 'సుత్తి' కొట్టిన రాజకీయ నాయకులు!
ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వగ్రామానికి చేరుకున్న సాక్షి మాలిక్‌ను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు వెళ్లిన ప్రజలకు రాజకీయ నాయకులు షాకిచ్చారు. హర్యాణాలోని మోఖ్రా చేరుకున్న సాక్షిని అభినందిస్తూ ప్రభుత్వం బుధవారం ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి పలువురు నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. కాంస్య పతక విజేతను చూసేందుకు 36 గ్రామాలు, సమీప పట్టణాల నుంచి 15 వేలమంది ప్రజలు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చారు. ఆమె ఏం చెబుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే రాజకీయ నేతలు ప్రజలకు విసుగు తెప్పించారు. రెండున్నర గంటలపాటు ఒకరి తర్వాత ఒకరుగా మాట్లాడుతూ తమ గొప్పలు చెప్పుకున్నారు. సాక్షి నవ్వుతూ చేతులు ఊపడం తప్ప ఏమీ చేయలేకపోయింది. నేతల తీరుతో ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సాక్షికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఒకదశలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి తర్వాత ఒకరి చేతులు మారుతున్న మైక్‌ను చూసి సాక్షి కూడా మౌనంగా నిట్టూర్చడం కనిపించింది. ఓ దశలో సన్మాన సభ నిర్వహించిన మహావిద్యాలయ(కళాశాల)పై విద్యాశాఖా మంత్రి రామ్ బియాస్ శర్మ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. మంత్రి మాట్లాడుతూ మహావిద్యాలయను 'మహిళా విద్యాలయ'గా మారుస్తామని ప్రకటించారు. దీంతో వెంటనే స్టేజ్‌పైకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఆయన చేతిలోని మైకును తీసుకుని అది మహిళా మహావిద్యాలయేనని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీంతో స్పందించిన మంత్రి ‘‘అయితే సాక్షి మాలిక్ మహిళా విద్యాలయగా మారుస్తాం’’ అని ప్రకటించారు. ఇలా ఎవరికి వారే స్పీచ్‌లతో దంచేశారు. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత అభయ్ చౌతాలా మైకందుకుని సాక్షి తన మాటలు వినడం వల్లే పతకం గెలిచిందని, ఇప్పుడు తన సలహాలు, సూచనలు వింటే వచ్చేసారి స్వర్ణ పతకం గెలుస్తుందని సొంత డబ్బా కొట్టుకున్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు స్పీచ్‌లతో అదరగొట్టేయడంతో బెదిరిపోయిన జనం ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు.