: భారత జలాంతర్గాముల రహస్య సమాచారం లీక్‌.. పలుదేశాల్లో ఆందోళన: ఫ్రాన్స్ నేవీ మాజీ అధికారి పనేనని అనుమానం!


ఫ్రెంచ్ కంపెనీ డీసీఎన్ఎస్‌తో కలిసి ముంబైలోని మజగావ్ డాక్‌లో రూపొందిస్తున్న ఆరు అత్యంత అధునాతన ‘స్కార్పీన్’ జలాంతర్గాముల సమాచారం లీకేజీ వ్యవహారంలో ఫ్రాన్స్ నౌకాదళ మాజీ అధికారి, డీసీఎన్ఎస్ సబ్ కాంట్రాక్టర్ పాత్ర ఉన్నట్టు ‘ద ఆస్ట్రేలియన్’ పత్రిక తన వెబ్‌సైట్‌లో సంచలనాత్మక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఫ్రెంచ్ ప్రభుత్వం దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. తద్వారా లీకేజీ వ్యవహారానికి సంబంధించిన అసలు నిజాన్ని నిగ్గుతేల్చాలని భావిస్తోంది. ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రకారం.. స్కార్పీన్‌ జలాంతర్గాముల సాంకేతిక అంశాలు, బలాబలాలు, నీటి అడుగున రహస్యంగా సంచరించగల సామర్థ్యం, శత్రువుల కంటబడకుండా మాట్లాడుకునేందుకు జలాంతర్గామిలో ఏర్పాటు చేసిన రహస్య గదులు, ఫ్రీక్వెన్సీల ద్వారా సమాచార సేకరణ, ఆయా జలాంతర్గాముల అయస్కాంత, విద్యుదయస్కాంత సమాచారం, టార్పెడో లాంచ్ సిస్టమ్, కంబాట్ సిస్టమ్, వేగం, శబ్దం, ఎంత లోతులో ప్రయాణించగలవు, పైకి వచ్చేటప్పుడు చేసే శబ్దం స్థాయి.. తదితర వాటికి సంబంధించిన పూర్తి వివరాలు లీకైన వాటిలో ఉన్నాయి. అయితే ఈ సమాచారం చాలా పాతదని, ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయని భారత నౌకాదళం పేర్కొంది. లీకేజీ వ్యవహారంపై విశ్లేషణ జరుపుతున్నట్టు తెలిపింది. కాగా లీకేజీ భారత్ వైపు నుంచే జరిగి ఉంటుందని ఫ్రాన్స్ వర్గాలు భావిస్తుండగా, లీకేజీ మూలాలు విదేశాల్లో ఉన్నట్టు అనిపిస్తోందని భారత వర్గాలు చెబుతున్నాయి. కాగా చీలీకి యుద్ధ నౌకలు, రష్యాకు త్రివిధ నౌకను డీసీఎన్ఎస్ విక్రయించనున్న నేపథ్యంలో ఆయా దేశాల్లోనూ లీకేజీపై ఆందోళన మొదలైంది. లీకేజీ కథనంపై స్పందించిన రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్ మాట్లాడుతూ ఏయే వివరాలు లీకయ్యాయి, ఆ సమాచారంలో మన జలాంతర్గాముల గురించి ఏం ఉంది? తదితర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా నేవీ చీఫ్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తిస్థాయిలో వివరాలు తెలుస్తాయన్నారు. జలాంతర్గాముల లీకేజీని తీవ్రంగా పరిగణిస్తున్న ఫ్రెంచ్ దర్యాప్తు జరపనున్నట్టు తెలిపింది. లీకేజీ బాధ్యులు, ఆ పత్రాల్లో ఉన్న సమాచారం తదితర అంశాలపై దర్యాప్తు జరపనున్నట్టు ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండ్రె జిగ్లర్ పేర్కొన్నారు. డీసీఎన్ఎస్‌‌తో తమ అధికారులు చర్చిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు లీకేజీ వ్యవహారంతో ఆస్ట్రేలియా కూడా ఆందోళన చెందుతోంది. ఆ దేశం చేపట్టిన సబ్‌మెరైన్ల ప్రాజెక్టును కూడా డీసీఎన్ఎస్‌ దక్కించుకోవడమే ఇందుకు కారణం. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, భారత్ కోసం నిర్మిస్తున్న జలాంతర్గాములకు, ఆస్ట్రేలియా కోసం రూపొందించే జలాంతర్గాములకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News