: కొణిజేటి రోశయ్యకు ఎక్స్ టెన్షన్?... తమిళనాడు గవర్నర్ గా మరింత కాలం పాటు రోశయ్యే!
తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్న తెలుగు నేలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త కొణిజేటి రోశయ్య మరింత కాలం పాటు కొనసాగనున్నారు. ఈ నెలాఖరులో గవర్నర్ గా ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వివాదరహితుడిగా ఉన్న రోశయ్యను తమ రాష్ట్రానికి గవర్నర్ గా మరింత కాలం పాటు కొనసాగించాలని తమిళనాడు సీఎం జయలలిత ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. రోశయ్యతో పాటు అండమాన్ నికోబార్, మణిపూర్, అసోం, పంజాబ్ గవర్నర్ల పదవీ కాలం కూడా ముగియనుంది. అయితే తమిళనాడు మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే కొత్త గవర్నర్లను నియమించింది. ఈ నేపథ్యంలో రోశయ్యను మరింత కాలం పాటు తమిళనాడు గవర్నర్ గా కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు చూపుతోందన్న వాదనకు బలం చేకూరింది. వివాదరహితుడిగా ఉన్న రోశయ్యను తమిళనాడుకు మరింత కాలం పాటు కొనసాగిస్తే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీలు ప్రధాని మోదీకి చెప్పినట్లు సమాచారం.