: జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్...శ్రీలంక విజయం!


శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా బౌలర్ జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. రెండు ఓవర్లలోనే ఫాల్కనర్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. రెండో వన్డేలో ఇన్నింగ్స్ 46వ ఓవర్ చివరి బంతికి లంక బ్యాట్స్ మన్ కుశాల్ పెరీరా (54) ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఆ ఓవర్ ముగిసింది. తరువాతి ఓవర్ ను మరో బౌలర్ వేయగా, 48వ ఓవర్ లో బౌలింగ్ చేసిన ఫాల్కనర్ తొలి బంతికి ఎంజెలో మాథ్యూస్ (57) ను అవుట్ చేశాడు. తరువాతి బంతికి తిసారా పెరీరా (12) ను బౌల్డ్ చేశాడు. దీంతో హ్యాట్రిక్ ఫీట్ సాధించిన ఆరో ఆసీస్ బౌలర్ గా ఫాల్కనర్ చరిత్రపుటల్లోకి ఎక్కాడు. శ్రీలంక జట్టుపై హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్ గా ఫాల్కనర్ నిలవగా, గతంలో డానియెల్ క్రిస్టియన్ శ్రీలంక జట్టుపై హ్యాట్రిక్ నమోదు చేశాడు. కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 288 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 206 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో రెండో వన్డేలో 82 పరుగుల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్ లో రెండు జట్లు చెరొక విజయంతో సమఉజ్జీలుగా నిలిచాయి.

  • Loading...

More Telugu News