: అందవిహీనంగా ఉంటే తన జోలికి రారని శరీరాన్ని కాల్చేసుకుంది
అంద విహీనంగా ఉంటే తనపై మళ్లీ అత్యాచారానికి పాల్పడరని భావించిన ఒక టీనేజర్ తన శరీరానికి నిప్పంటించుకుని కాల్చుకున్న దారుణ సంఘటన ఇరాక్ లో జరిగింది. ఐఎస్ ఉగ్రవాదుల అకృత్యాలకు తాను మళ్లీ బలికాకూడదనుకున్న యాజిదీ తెగకు చెందిన 17 సంవత్సరాల యాస్మిన్ అనే అమ్మాయి ఈ దారుణానికి పాల్పడింది. ఇరాక్ లోని శరణార్థుల శిబిరంలో రెండు వారాలుగా తలదాచుకుంటున్న యాస్మిన్, ఆ శిబిరం బయట ఉగ్రవాదుల అరుపులు వినిపించినట్లు భ్రమపడింది. దాంతో, మళ్లీ తనను అపహరించుకు పోతారేమోనని భయపడింది. అందవిహీనంగా ఉంటే తననెవరూ పట్టించుకోరని భావించిన ఆ టీనేజర్ తన శరీరానికి నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడింది. అయితే, జర్మనీకి చెందిన కిజిల్ హాన్ అనే వైద్యుడు ఆమెను గుర్తించి వైద్యసేవలందించాడు. ఈ సంఘటన గత ఏడాది జరిగింది. గాయాల నుంచి కోలుకుంటున్న యాస్మిన్, తనలాగే ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న సుమారు 1100 మహిళలతో కలిసి జర్మనీలో మానసిక చికిత్స పొందుతోంది. కాగా, సిరియా, ఇరాక్ లలో ఐఎస్ ఉగ్రవాదుల అరాచకాల కారణంగా లక్షలాది మంది పౌరులు వేరే దేశాలకు వలస వెళ్తున్నారు.