: పోలవరంపై ఉమాభారతికి లేఖలు రాశాను.. ఆమె స్పందించలేదు: కేవీపీ
పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ నిబంధనలను ఎన్డీయే గవర్నమెంట్ తుంగలో తొక్కిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపేసేందుకు ఎన్డీయే కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న కేంద్రం, దానిని పూర్తి చేసేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి ఉమాభారతికి రాసిన తన లేఖలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని, ఆమెకు తాను రాసిన లేఖలు చేరినట్టు అక్నాలెడ్జెమెంట్స్ మాత్రం అందాయని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే...పోలవరం ప్రాజెక్టును ఆపేయాలని కుట్రపన్నుతున్నాయా? అన్న అనుమానం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాటల్లో పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేసేస్తున్నాయని, చేతల్లో మాత్రం పోలవరాన్ని ఆపేసే చర్యలు ప్రారంభమైనట్టు అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసినా కాల్వలు తవ్వడానికి 25 ఏళ్లు పట్టిందని, పోలవరం ప్రాజెక్టు అలా జరగకూడదన్న ముందు చూపుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పోలవరం కుడి, ఎడమ కాల్వల పనులు ప్రారంభించారని ఆయన తెలిపారు.