: ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్న ప్రయత్నంలో భవనం పైనుంచి పడ్డ యువకుడు!
ప్రేమమత్తులో పడి యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మాయిల మెప్పుకోసం అసాధ్యమైన పనులను సైతం చేసేయాలని, హీరోయిజం ప్రదర్శించాలని తహతహలాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అటువంటి ఘటనే తాజాగా అమెరికాలోని పిట్స్‌బర్గ్ ఓక్లాండ్ ప్రాంతంలోని ఆట్వాడ్ వీధిలో చోటుచేసుకుంది. గ్రాంట్ బర్డ్‌సంగ్ అనే యువకుడు తన ప్రియురాలి ముందు సాహసం ప్రదర్శించబోయాడు. ప్రమాదానికి గురై ఆసుపత్రిలో పడ్డాడు. గ్రాంట్ తన ప్రియురాలిని భవంతిపైకి తీసుకొచ్చాడు. భవనంపై ఆమెతో ఏకాంతంగా ముచ్చటించాడు. అనంతరం తన ప్రియురాలితో ఒక భవంతిపై నుంచి మరో భవంతిపైకి దూకుతానని చెప్పి.. అన్నంత పనీ చేశాడు. తాను నిలబడిన భవనం పైనుంచి మరో భవనంపైకి దూకే ప్రయత్నం చేశాడు. అయితే దూకలేక రెండు భవంతుల మధ్య నుంచి కింద పడ్డాడు. అదృష్టవశాత్తు కాలిగాయంతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.