: ఈజీ మనీ క్రికెటర్లను నాశనం చేస్తోంది.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మెక్‌గ్రాత్ సంచలన ఆరోపణ


ఈజీ మనీ క్రికెటర్లను ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను నాశనం చేస్తోందని ఆస్ట్రేలియా మాజీ బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ సంచలన ఆరోపణ చేశాడు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తుండడంతో ఆటగాళ్లు శిక్షణకు పుల్‌స్టాప్ పెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్‌లోని పీఏసీ స్టేడియంలో అండర్-23 ఫేసర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మెక్‌గ్రాత్ మాట్లాడుతూ టి20లు ఫాస్ట్ బౌలర్లను విపరీతంగా దెబ్బతీస్తున్నాయన్నాడు. ఇది ఒక్క భారత్‌కే పరిమితం కాలేదని, ప్రపంచమంతా ఈ సమస్య పేరుకుపోయి ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లకు తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఉంటుందని, కానీ టి20 లాంటి వాటిలో ఆ అవకాశం ఉండదని పేర్కొన్నాడు. ‘‘ఐపీఎల్, ఆస్ట్రేలియాలోని బిగ్‌బాష్ లాంటి వాటివల్ల తక్కువ సమయంలోనే క్రికెటర్లకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. దీంతో మరింతగా రాటుదేలేందుకు వారు కష్టపడడం లేదు. శిక్షణను అక్కడితో ఆపేస్తున్న విషయాన్ని గుర్తించా. చాలామంది యువ క్రికెటర్లు మంచి నైపుణ్యం సాధిస్తున్నారు. ఒకసారి బాగా సంపాదించే అవకాశం వచ్చాక వారు కష్టపడడాన్ని ఆపేస్తున్నారు ’’ అని మెక్‌గ్రాత్ వివరించాడు. క్రికెటర్లు బాగా సంపాదించడం చాలా మంచి విషయమని, అయితే డబ్బు అనేది ఆట తర్వాతే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని క్రికెటర్లకు సూచించాడు. క్రికెటర్ల లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడంపైనే ఉండాలి తప్ప డబ్బుపై కాదని సూచించాడు.

  • Loading...

More Telugu News