: కోహ్లీ నా ద‌గ్గ‌ర‌కు 10 సంవత్స‌రాల వ‌య‌సులోనే వ‌చ్చాడ‌ు.. ద్రోణాచార్య అవార్డు అందుకునేటప్పుడు నా పక్కనే ఉంటాడు: కోచ్ రాజ్‌‌కుమార్ శర్మ


టెస్ట్, వన్డే, టీ20.. ఫార్మాట్ ఏద‌యినా స‌రే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌, టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ముదులిపేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సిక్సర్లు, ఫోర్ల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ స‌చిన్‌తో త‌న‌ను పోల్చే స్థాయికి చేరుకున్నాడు ఈ స్టైలిష్ బ్యాట్స్‌మెన్. మరి కోహ్లీ విజయం వెనుక ఎవ‌రున్నారు? అంటే కోచ్ రాజ్‌‌కుమార్ శర్మ ఉన్నారనే చెప్పాలి. తాజాగా కేంద్రం రాజ్‌‌కుమార్ కు ద్రోణాచార్య అవార్డు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ తాను శిక్ష‌ణ‌నిచ్చిన త‌న శిష్యుడు విరాట్ కొహ్లీ గురించి ప‌లు విష‌యాలు తెలిపారు. కొహ్లీ ఎంతో తెలివైన వాడని ఆయ‌న అన్నారు. చిన్న‌ వయస్సులోనే టీమిండియాలో గొప్ప ఆట‌గాడు కావాలన్న కలతో కోహ్లీ త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చాడ‌ని ఆయ‌న అన్నారు. కోహ్లీ త‌న ద‌గ్గ‌ర‌కు 10 సంవత్స‌రాల వ‌య‌సులోనే వ‌చ్చాడ‌ని గుర్తు చేసుకున్నారు. గట్టి పట్టుదలతో సాధ‌న‌ చేసేవాడ‌ని రాజ్‌‌కుమార్ పేర్కొన్నారు. మొద‌టిసారిగా కోహ్లీ త‌న ద‌గ్గ‌ర‌కు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని, వ్యక్తిగతంగా మనిషిలో ఏమాత్రం మార్పు రాలేదని వ్యాఖ్యానించాడు. కోహ్లీలో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే గుణం ఉందని ఆయ‌న అన్నారు. ఆయ‌న‌లోని ఈ అంశ‌మే త‌న‌కు ఎంత‌గానో నచ్చిందని అన్నారు. త‌న శిష్యుడి లాంటి వారి అవసరం ఇండియాకి ఉంద‌ని రాజ్‌‌కుమార్ అన్నారు. తాను కోహ్లీలాగే మరి కొంత‌మందిని తయారు చేస్తానని పేర్కొన్నారు. కేంద్రం ప్ర‌క‌టించిన ద్రోణాచార్య అవార్డు త‌న‌లో బాధ్యతను రెట్టింపు చేసింద‌ని చెప్పారు. ద్రోణాచార్య అవార్డు తీసుకునే స‌మ‌యంలో కోహ్లీ త‌న‌ పక్కనే ఉంటాడని పేర్కొన్నారు. కాగా, కోహ్లీ తన గురువు రాజ్‌‌కుమార్ కి ఫోన్ చేసి ద్రోణాచార్య అవార్డు రావడం పట్ల అభినంద‌న‌లు తెలిపాడు.

  • Loading...

More Telugu News