: ఉక్కుమహిళకు కొత్త చిక్కులు... ఇరోం షర్మిల వద్ద పౌరసత్వానికి సంబంధించిన పత్రాలు లేవట!
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్ల పాటు దీక్షను చేసిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల (44) ఇటీవల తన నిరశనను విరమించిన సంగతి తెలసిందే. దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆమెకు ఇప్పుడు పౌరసత్వం చిక్కు వచ్చి పడింది. ఆమె భారతీయురాలే అయినా.. దానికి సంబంధించి చట్టబద్ధమైన ఎటువంటి ధ్రువపత్రాలు ఆమె వద్ద లేవు. ఎన్నికల బరిలోకి దిగి ముఖ్యమంత్రినవుతానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను భారతీయ పౌరురాలినని నిరూపించే ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. దానికి కావాల్సిన ధ్రువపత్రాలేవీ ఆమె వద్ద లేవు. పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఓటరు కార్డు, ఆధార్ వంటి ఏ కార్డులూ ఆమె వద్ద లేవట. ఈ అంశంపై షర్మిల మిత్రులు మీడియాతో మాట్లాడుతూ... మణిపూర్ ఉక్కుమహిళ రాజకీయాల్లోకి తప్పకుండా వస్తుందని, దానికోసం ప్రచారం చేపట్టాలంటే ఫండ్స్ అవసరమవుతాయని చెప్పారు. ఎన్నికల బరిలోకి దిగాలంటే షర్మిలకు బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు, ఓటర్ కార్డు తప్పనిసరని పేర్కొన్నారు. అవి లేకుండా ఎన్నికల్లోకి దిగడానికి నిబంధనలు అడ్డొస్తాయని చెప్పారు. ఈ చిక్కులనుంచి బయటపడడానికి షర్మిల ప్రయత్నాలు చేస్తోందని వారు తెలిపారు.