: ఆ మత్స్యకారుడి వద్ద 34 కిలోల అరుదైన ముత్యం!
ఒక మత్స్యకారుడి వద్ద గత పదేళ్లుగా ఉన్న అత్యంత అరుదైన ఒక ముత్యం రెండు రోజుల క్రితమే బయటపడింది. ఫిలిప్పీన్స్ కి చెందిన ఈ మత్స్యకారుడు 2006లో పాలవాన్ ద్వీపంలో చేపల వేటకు వెళ్లిన సందర్భంలో పడవకు లంగరు వేస్తుండగా ఒక రాయి అడ్డుపడింది. తెల్లగా, వింత ఆకృతిలో ఉన్న ఆ రాయి ఆకర్షించే విధంగా ఉండటంతో దానిని తీసుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తాను పడుకునే మంచం కింద పెట్టుకుని మరచిపోయాడు. ఈ క్రమంలో ఒక రోజు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో సామానులన్నీ బయట పడేస్తున్న సమయంలో ఈ రాయి బయటపడింది. అయితే, అప్పటికే దీని గురించి మర్చిపోయిన సదరు మత్స్యకారుడి దృష్టి దీనిపై పడింది. దానిని పట్టుకువెళ్లి స్థానిక టూరిజం అధికారులకు చూపించాడు. దానికి ఫొటో తీసి, దానిని సామాజిక మాధ్యమాల్లో అధికారులు పోస్ట్ చేశారు. అది రాయి కాదని, ముత్యం కావచ్చని ఈ సందర్భంగా వారికి తెలిసింది. ఆ తర్వాత దానిని పరీక్షించి చూడగా అత్యంత అరుదుగా లభించే ముత్యమని తేలింది. సుమారు 34 కిలోలు బరువున్న ఈ ముత్యం 2.2 అడుగుల పొడవు కూడా ఉంది. దీని విలువ సుమారు 100 మిలియన్ డాలర్లు ఉండొచ్చని నిపుణుల అంచనా. ఈ అరుదైన ముత్యం గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జెమాలజిస్ట్ ల వద్దకు దీనిని తీసుకువెళ్లనున్నారు.