: దారి పొడవునా సింధుకు ఘన స్వాగతం!
రియో సిల్వర్ స్టార్ పీవీ సింధుకు రెండు తెలుగు రాష్ట్రాలు బ్రహ్మరథం పట్టాయి. రియో నుంచి నిన్న ఉదయం నేరుగా హైదరాబాదు చేరుకున్న సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కు శంషాబాదు ఎయిర్ పోర్టులో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏపీ మంత్రులు వెళ్లిపోగా... తెలంగాణ మంత్రులు దగ్గరుండి మరీ ఆమెను ర్యాలీగా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియానికి తీసుకెళ్ళారు. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఆమెను ఘనంగా సన్మానించారు. తెలంగాణలో సింధుకు సన్మానం నిన్న సాయంత్రం దాకా సాగింది. తాజాగా నేటి ఉదయం విజయవాడ చేరుకున్న రజత పతక విజేతకు ఘనంగా స్వాగతం లభించింది. హైదరాబాదు నుంచి విజయవాడ వచ్చేందుకు ఆమెకు ఏపీ సర్కారు ఓ ప్రత్యేక విమానాన్నే ఏర్పాటు చేసింది. బెజవాడ ఎంపీ కేశినేని దగ్గరుండి మరీ ఆమెను విజయవాడ తీసుకెళ్లారు. ఇక గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ వరకు జరుగుతున్న ర్యాలీకి ఏపీ జనం బ్రహ్మరథం పట్టారు. ర్యాలీ సాగుతున్నంత మేర రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ జనం... సింధుకు జేజేలు పలికారు.